Rakul Preeth Singh revealed the truth
Rakul Preeth Singh: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి రెండుసార్లు పెళ్లి చేశారా..? ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా మంచి హిట్ కావడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది రకుల్. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఒకే ఏడాది ఏకంగా 5 చిత్రాలతో ప్రేక్షకులను అలరించి బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ విషయం ఇలా ఉంటే.. ఈ చిన్నది బాలీవుడ్ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నాని తో గత కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వీరిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్టులు చేశారు.
ఈ నేపథ్యంలోనే వీరు పెళ్లి చేసుకున్నారు అంటూ కొన్ని రూమర్స్ వస్తే, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరికొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది రకుల్. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ” మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నామనే విషయాన్ని దాచాలని ఏ రోజు అనుకోలేదు. అలా చేయడానికి మేము చిన్న పిల్లలం కాదు కదా. ప్రేమ, పెళ్లి అనేది అందరి జీవితాలలో సహజంగా ఉండేవే. అందులో దాచడానికి ఏం ఉంటుంది. మేం మా ఇద్దరి విషయం అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
కొన్ని మీడియాలలో ఇప్పటికే మాకు రెండు సార్లు పెళ్లి చేసేసారు. గత డిసెంబర్ లో మా పెళ్లి అయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటిని మేము ఖండించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రహస్యంగా వివాహం చేసుకున్నామని రాశారు. ఒకవేళ మేము నిజంగానే పెళ్లి చేసుకున్న రోజు వాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటివరకు మాపై వచ్చిన ఇలాంటి వార్తలు చూసి చాలా నవ్వుకున్నాం. వాళ్లు ఎంతో నమ్మకంగా రాస్తారు. ఇలాంటివన్నీ నేను సినిమా సెట్ లో ఉన్నప్పుడు వస్తుంటాయి” అంటూ చెప్పుకొచ్చింది.